Is God was born from fear — and fear was born from God!
భయం నుండి దేవుడు పుట్టాడు - దేవుడి నుండి భయం పుట్టింది !
........................................
దేవుడనే భావన ఒక్కసారిగా పుట్టింది కాదు.అది మనిషి పరిణామంతో పాటు వేలాది సంవత్సరాల పాటు నెమ్మదిగా అభివృద్ధి చెందింది.దాదాపు 30,000 నుంచి 40,000 ఏళ్లక్రితం ఆదిమానవుడు పిడుగులు, వరదలు, అగ్నిపర్వతాలు, భూకంపాలు, వ్యాధులు, మరణాలు వంటి ప్రకృతి సంఘటనలను చూసి భయపడ్డాడు. వాటి వెనుక ఏదో అదృశ్యశక్తి పనిచేస్తోందని ఊహించాడు. భయం,ఆశ్చర్యం, అర్థంకాని విషయాలకు వివరణ వెతకాల్సిన అవసరం కలిసి మొదటి దైవభావనకు పునాది వేశాయి. మానవశాస్త్రవేత్త ఎడ్వర్డ్ టైలర్ దీన్ని యానిమిజం అని పేర్కొన్నాడు. అంటే ప్రతి వస్తువులో ప్రతి ప్రాణిలో ఒకఆత్మ లేదా చైతన్యం ఉందని మనిషి నమ్మడం.
తర్వాత చెట్లు నదులు కొండలు జంతువులు మాత్రమే కాకుండా చనిపోయిన పూర్వీకుల ఆత్మలు కూడా తమ చుట్టూనే ఉన్నాయని మనిషి విశ్వసించాడు. ఆత్మల ఆరాధనకు ఇదే ఆరంభం. ఇప్పటికీ ప్రపంచంలోని అనేక గిరిజన సమాజాల్లో కనిపించే పూర్వీకుల పూజలు నాగుల పూజలు వృక్షారాధనలు ఆ సంప్రదాయాల కొనసాగింపే. సుమారు 10,000 నుంచి 12,000 ఏళ్ల క్రితం వ్యవసాయం ప్రారంభమై మనిషి స్థిరనివాస జీవితం గడపడం మొదలుపెట్టినప్పుడు అవసరాలకు అనుగుణంగా దేవతలను సృష్టించుకున్నాడు. వర్షానికి, పంటలకు, సూర్యకాంతికి, సంతానానికి ప్రత్యేక దేవతలను ఊహించాడు.అలా బహు దేవతారాధన అభివృద్ధి చెందింది. ఈజిప్టు, మెసొపొటేమియా, సింధు, గ్రీసు, రోమ్ నాగరికతల్లో అనేక దేవతలు ఉండేవారు.
చిన్నతెగలు,నగర రాజ్యాలు పెద్ద సామ్రాజ్యాలుగా మారినప్పుడు రాజకీయ అధికారంతో పాటు దైవభావన కూడా కేంద్రీకృతమైంది. ఒక రాజ్యానికి ఒక చక్రవర్తి ఉన్నట్లే సృష్టికి కూడా ఒకే అంతిమశక్తి ఉంటుందనే ఆలోచన బలపడింది.
భారతదేశంలో కూడా అనేక దేవతల వెనుక ఒకే బ్రహ్మతత్వం ఉందనే భావన ఉపనిషత్తుల కాలంలో బలంగా వ్యక్తమైంది.
ఈజిప్టులో అఖెనాటెన్ కాలం నుంచి యూదు క్రైస్తవ ఇస్లాం మతాల్లో ఏకదేవతారాధన స్థిరపడింది.
ఇదే సమయంలో నేను ఎవరు ? మరణం తర్వాత ఏమవుతుంది ? సృష్టి ఉద్దేశం ఏమిటి ? వంటి ప్రశ్నలు మానవుడిని ఆలోచింపజేశాయి. వాటికి సమాధానాలుగా కర్మ పునర్జన్మ మోక్షం స్వర్గం నరకం వంటి భావనలు ఏర్పడ్డాయి.సనాతనంలోని ఉపనిషత్తులు బౌద్ధం జైనం తావోయిజం వంటి తాత్విక సంప్రదాయాలు ఈ ప్రశ్నలకు తమదైన సమాధానాలు అన్వేషించాయి. సమాజంలో ఐక్యతను నైతిక క్రమాన్ని నిలబెట్టడంలో దేవుడనే భావన ముఖ్యపాత్ర పోషించింది. మతం చట్టం వేరు కాని కాలంలో దేవుడి భయం ఒక సామాజిక నియంత్రణ వ్యవస్థగా పనిచేసింది.మనిషి తనలోని ఉత్తమ గుణాలను బయట ఒక దేవుని రూపంలో ప్రతిబింబింపజేశాడు.మొత్తంగా చూస్తే ప్రకృతి పట్ల భయం, అర్థంకాని విషయాలకు వివరణ కావాలనే తపన సామాజిక క్రమశిక్షణ, అవసరం, కష్టాల్లో ఓదార్పు కోసం ఆశ, జీవనవిజయాల పట్ల కృతజ్ఞత, మరణం అనే అనిశ్చితిని ఎదుర్కోవాలనే మానసిక అవసరం కలిసి దేవుడనే భావనను నిర్మించాయి.కాలం, ప్రాంతం,సమాజ నిర్మాణాన్ని బట్టి అది యానిమిజం నుంచి బహుదేవతారాధనకు అక్కడి నుంచి ఏకదేవతారాధనకు తాత్వికచింతనకు రూపాంతరం చెందింది.అయితే దాని మూలంలో మాత్రం మనిషి ఊహాశక్తి భయం
ఆశ అర్థాన్వేషణ అనే మానసిక అవసరాలే ఉన్నాయి.
//సేకరణ//
................జిబి విశ్వనాథ 9441245857 అనంతపురం.